KAVITHA: కవితకు మూడు రోజుల ఈడీ కస్టడీ
హైదరాబాద్ లో కవిత బంధువుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీ;
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టుచేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడు రోజుల కస్టడీ నిన్న ముగియగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆమెను. రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవితను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది... కస్టడీ పొడిగిస్తే ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరిని కవితతో కలిసి విచారిస్తామని తెలిపారు. కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేస్తున్నట్టు తెలిపిన ఈడీ మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
కవిత తన ఫోన్‌లో డేటాను తీసేశారని, కుటుంబ ఆదాయపన్ను, వ్యాపారాల వివరాలు అడిగినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ వివరాలు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే వివరాలను ఎలా ఇవ్వగలరని.. ఆమె తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. చివరకు కోర్టు కవితను మరో మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. అటు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న ఆమె తరపు న్యాయవాది వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్న కవిత ఈ చర్యపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
అటు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ అధికారులు ప్రస్తావించారు. కవిత ఇంట్లో చేసిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ దొరికిందని, ఆయన్ను రెండుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదని తెలిపింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలకపాత్ర పోషించారని అతడు కవితకు అత్యంత సన్నిహితుడని తెలిపింది. కవిత అరెస్ట్ జరిగినప్పుడు శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ సమయంలో శరణ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లావాదేవీలకు చెందిన సమాచారం గుర్తించినట్లు ఈడీ వివరించింది. అందులోని సమాచారం ఆధారంగా మాదాపూర్‌లోని శరణ్ నివాసంలో ఈడీ అధికారులు ఇవాళ తనిఖీలు చేశారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లోని DSR రేగట్టె అపార్ట్‌మెంట్స్‌లో కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో 11 గంటలు ED సోదాలు చేసింది.