REVANTH: వేల కోట్లు సంపాదించుకుంటే జాతిపిత అవుతారా.?
కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు... బీఆర్ఎస్ ఆందోళనలపై రేవంత్ ఘాటు స్పందన.. కేసీఆర్‌ను జాతిపిత అనడంపై తీవ్ర ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు’ వేడుకలను హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి రావి నారాయణ రెడ్డి జాతీయ స్మారక అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనలపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా..?’ అని కొందరు ప్రశ్నించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఆదర్శం ఏమిటి..? తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని రేవంత్ ప్రశ్నించారు. నిజంగా ఆయన జాతిపిత అయితే, ఏ విషయంలో ఆదర్శంగా నిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎవరూ ఇక్కడ రాజులు, చక్రవర్తులు కాదని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను గౌరవించామన్న వాదనను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ‘ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా..? అప్పట్లో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయలేదా?’ అని నిలదీశారు.
ప్రశ్నించవద్దంటే ఎలా?: రేవంత్‌రెడ్డి
‘‘నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి పోరాటం చేశారు. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై పోరాడారు. 500 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుంది. ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని ఆయన చాటి చెప్పారు. 60 ఏళ్లు వచ్చేసరికి రాజకీయ పదవీ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణరెడ్డి. ప్రజల నుంచి తిరస్కారం పొందినా.. నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదు. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించింది. వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల వ్యాపారాలు మీకెలా వచ్చాయి..? బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. నేరాలు చేస్తాం.. పశ్నించవద్దని మీరెలా అంటారు? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదు’’ అని సీఎం స్పష్టం చేశారు. రావి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డు పొందడం ఎంతో గొప్పదిగా భావిస్తానని అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. రావి నారాయణ రెడ్డి నిత్య చైతన్య స్ఫూర్తి అని కొనియాడారు. సొంత ఆస్తులను ప్రజలకు పంచిన మహానుభావుడని ప్రశంసించారు. రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సీఎం ప్రదానం చేశారు.