DGP: హీరో అయినా బయట పౌరుడే
ప్రజా భద్రత కంటే మూవీ ప్రమోషన్లు ముఖ్యం కాదన్న డీజీపీ.. మోహన్ బాబుపై డీజీపీ వ్యాఖ్యలు;
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. వివాదం మరింత పెరుగుతోంది. థియేటర్ లో పోలీసులు తన వద్దకే రాలేదని.. ఏం చెప్పలేదని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. దీనిపై పోలీసులు కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ అంటే తమకు ఎలాంటి కోపం లేదని డీజీపీ తెలిపారు. ఆయన సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థం చేసుకోవాలని సూటిగా చెప్పేశారు. పోలీసుల వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మళ్లీ స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీరుపై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సినిమా హీరో అయినా బయట దేశ పౌరుడే అన్నారు. అర్జున్ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. థియేటర్‌లో తొక్కిసలాట దురదృష్టం అన్న డీజీపీ.. ప్రజా భద్రత కంటే మూవీ ప్రమోషన్లు ముఖ్యం కాదని చెప్పారు. ఎవరు తప్పు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మోహన్ బాబుపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
మంచు ఫ్యామిలీ గొడవపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. వాళ్ల కుటుంబ విభేదాల కారణంగానే గొడవలు జరిగాయన్నారు. అయితే, జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబుపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మోహన్ బాబుపై ఇప్పటికే కేసు నమోదు చేశామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు.
టాలీవు డ్ పై రేవంత్ పగబట్టారు: బండి సంజయ్
తెలుగు చిత్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి పగబట్టారని కేంద్రమంత్రి బహండి సంజయ్ అన్నారు. అల్లు అర్జున్ ను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో సినిమా లెవల్లో ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. సినిమాలపై చర్చలు జరపడం ఏంటని ప్రశ్నించారు.