CONGRESS: మాట ఇస్తే తప్పం: శివకుమార్
కర్ణాటకలో పక్కాగా హామీల అమలు... అనుమానం ఉంటే కేసీఆర్ వచ్చి చూసుకోవచ్చన్న శివకుమార్;
తెలంగాణలో రెండో విడత విజయభేరి యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేతలు, వికారాబాద్ జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్..., పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాండూరులో బస్సుయాత్ర నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రజలమీద ప్రేమతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలను పక్కాగా అమలు చేస్తున్నామని డి.కె.శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చింది అంటే తప్పక నేరవేరుస్తుందని డీకే శివకుమార్ అన్నారు. "కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గృహలక్ష్మి పథకం ద్వారా 1.10కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తున్నాం. హామీ ఇచ్చిన ప్రకారం పేదలకు 10కిలోల సన్నబియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నాం. కర్ణాటకలో మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.” అని తెలిపారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అమలు చేస్తోందన్నారు. అనుమానం ఉంటే కేసీఆర్, కేటీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలని సవాల్ విసిరారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు 2 వేల రూపాయలు, పేదలకు 10 కిలోల ఉచిత సన్నబియ్యం.... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోనూ ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ తప్పక అమలు చేస్తుందన్నారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వంలో విద్యుత్ ఉత్పత్తి ఏమీ జరగలేదని.. తమ ప్రభుత్వం వచ్చాక.. 23 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
. ‘తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేవలం 8..9 గంటలు మాత్రమే ఇస్తున్నారని, హైదరాబాద్‌కు ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైలు తెచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 12 శాతం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం.. మైనార్టీలను మోసం చేసిందన్న రేవంత్.. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఇవాళ ఆదివారం సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే ప్రచారం చేయనున్నారు.