TG: అధికారిక లాంఛనాలతో "మందా" అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు;
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మందా జగన్నాథం కొన్నాళ్లుగా కుటుంబ సభ్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మందా జగన్నాథం కుంటుంబ సభ్యులను పరామర్శించారు.
రాజకీయ ప్రస్థానం ఇదే..
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో కన్నుమూశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన జగన్నాథం నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరారు.
తనదైన ముద్ర వేశారు: చంద్రబాబు
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్రవేశారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన ఆయన.. తెలుగుదేశంపార్టీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.