Munugode By Election: అందరి చూపు మునుగోడు వైపే.. మూడు ప్రధాన పార్టీల ఛాలెంజ్..
Munugode By Election: మిషన్ మునుగోడు.. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీల ముందున్న పెద్ద సవాల్.;
Munugode By Election: మిషన్ మునుగోడు.. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీల ముందున్న పెద్ద సవాల్. ఎన్నిక అనివార్యం. అయితే ఎలా ఎదుర్కోవాలన్నదే పార్టీల ముందున్న ఛాలెంజ్. 2023 ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఎన్నికను రాజకీయ పార్టీలన్నీ చాలెంజింగ్‌గా తీసుకున్నాయి.మునుగోడు ఉప ఎన్నికలు నవంబర్ నెలలో జరుగుతాయని భావిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంత వరకూ అభ్యర్థులను నిర్ణయించలేదు. రెండు పార్టీల్లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.కాంగ్రెస్ ది సిట్టింగ్ స్థానం.అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తామే గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.
మరోవైపు మునుగోడు బై ఎలక్షన్‌పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గ డిటేల్స్ కోరింది. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, ఓటర్ల సంఖ్య, ప్రస్తుత పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్‌ను ఈసీ ఆదేశించినట్లు సమాచారం.దీంతో ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు కలిపి మునుగోడుకు బై ఎలక్షన్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేస్తే..అక్టోబర్‌లో దసరా తర్వాత పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సీఈవో ఆఫీస్ వర్గాలు అంటున్నాయి.
ఇక మునుగోడు నియోజకవర్గంలో ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి.. 2 లక్షల 27వేల 265 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో 298 పోలింగ్ స్టేషన్లలలో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి 300కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈసీ ఆదేశాలతో ఈవీఎంలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది.యాదాద్రి జిల్లా నుంచి 190 బ్యాలెట్ యూనిట్లు, 351 కంట్రోల్ యూనిట్లు, 506 వీవీ ప్యాట్‌లు మునుగోడుకు చేరుకున్నాయి. ఇప్పటికే 1,002 బ్యాలెట్ యూనిట్లు, 245 కంట్రోల్ యూ నిట్లు, 90 వీవీప్యాట్‌లు బై ఎలక్షన్ కోసం రెడీ చేసుకున్నారు.
మరోవైపు గుజరాత్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటితో పాటు ఎన్నికలు జరిపితే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్‌లోనే మునుగోడు బైపోల్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.