HYDRA: హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత దూకుడు పెంచనున్న హైడ్రా;
హైడ్రా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని B-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
బతుకమ్మకుంటపై కీలక తీర్పు
బతుకమ్మకుంటపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో హైడ్రాకు మరింత జోష్ వచ్చింది. త్వరలో చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. 1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. తాజా సర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి.. అనుకూలమైన తీర్పు రావడంలో హైడ్రా కృషి చేసింది.
జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించి మరీ..
హైడ్రాను ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ప్రశ్నలు తలెత్తడంతో.. ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. మరోవైపు.. హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.