FSL FIRE: అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు దగ్దం
ఫోరెన్సిక్ ల్యాబ్‌ను పరిశీలించిన డీజీ శిఖాగోయల్.. 7 మెటీరియల్స్ కాలిపోయాయన్న డీజీ శిఖాగోయల్... ఓటుకు నోటు కేసు మెటీరియల్ లేదని స్పష్టీకరణ
నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని, నష్టం అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇవాళ ఫోరెన్సిక్ లాబొరేటరీస్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఉదయం 10.08 గంటలకు ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదం జరిగిందని, మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి ఒకరు గుర్తించారని చెప్పారు. ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు మంటలు వ్యాపించాయని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తే సాధ్యపడలేదన్నారు. మొదట ప్రాపర్టీ రూమ్‍లో పొగ, మంటలు చెలరేగాయని ఆ తర్వాత లైబ్రరీ, హెచ్ఆర్ డీ రూమ్‌కు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 2024 పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కు వచ్చాయని ఇందులో 7 మెటీరియల్స్ తాజా ప్రమాదంలో కాలిపోయాయని చెప్పారు వీటిని రిట్రైవ్ చేస్తున్నామని మిగతావన్నీ సంబంధింత అధికారులకు అప్పగించామన్నారు. ఇక 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో లేదన్నారు. ఈ కేసులో 2015లో రెండు విడతల్లో 16 మెటీరియల్ ఆబ్జెక్టులు ఎఫ్ఎస్ఎల్కు అందాయని అదే సంవత్సరం వాటి నివేదికలను ఏసీబీ కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన 16 వస్తువులు ఇప్పటికే కోర్టుకు తిరిగి అప్పగించినట్టు తెలిపారు.
సంచలన విషయాలు వెలుగులోకి....
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‍స్పెక్టర్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలు పేర్కొన్నారు. 5 గదుల్లోని ఫైల్స్ కాలిపోయినట్లు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్‍తో పాటు కేసు వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్ కాలిపోయాయని సర్వర్ రూమ్‍లో ఫైళ్లు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. నిన్న ఉదయం సుమారు 10:08 గంటల సమయంలో తాను కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పనిచేస్తున్న క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనుకుని ఉన్న ప్రాపర్టీ రూమ్ (మొదటి అంతస్తు) లో మంటలు అంటుకుని అవి ఇతర గదులకు కూడా వ్యాపిస్తున్నాయని తనకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే తాను ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని సూచించానని పేర్కొన్నారు. అలాగే కార్యాలయంలో ఉండే అవకాశం ఉన్న ఇతర సిబ్బందిని కూడా సంప్రదించి సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరానని అనంతరం తాను కూడా స్వయంగా కార్యాలయానికి బయలుదేరి10:25 గంటలకు అక్కడికి చేరుకున్నాని తెలిపారు.