gandi: "కల్వకుర్తి" పథకం ప్రధాన కాలువకు గండి
పూడ్చివేత పనులు ప్రారంభించిన అధికారులు;
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ82 ప్రధాన కాలువకు గండి పడింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని వెల్దండ సమీపంలో కాలువకు గండిపడింది. వరద ప్రవాహం పెరగడంతో కాలువకు గండి పడింది. ఈ ప్రాంతంలోని పొలాలు నీట మునిగాయి. గత ఏడాది కాలంలో కేవలం వెల్దండ మండల పరిధిలోనే ప్రధాన కాలువకు గండిపడటం ఇది ఐదో సారి. మొత్తంగా కాలువ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఎనిమిది సార్లు గండిపడింది. దీంతో నిరంతరం నీరంతా వృథాగా పోయి చివరి కాలువకు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
నిండుకుండను తలపిస్తోన్న సాగర్
కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండగా.. అక్కడి నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే నీటిమట్టం ఉంది. 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1.09 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
పూడిమడక తీరానికి భారీ సొర
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం మత్స్యకారుల గాలానికి భారీ సొర చేప చిక్కి సంచలనం సృష్టించింది. తొలుత దాన్ని చూసి భయపడిన మత్స్యకారులు సుమారు ఐదు గంటలపాటు శ్రమించి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను పడవకు దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి ఎత్తడం కష్టమవడంతో తాడుతో కట్టి తీరానికి చేర్చారు. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువున్న ఈ సొరను వేలం వేయగా, రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశారని మత్స్యకారుడు మడ్డు నూకరాజు తెలిపారు.