లంకెబిందెలోని నగలు.. అమ్మవారి ఆభరణాలు

జనగామ పట్టణం సమీపంలోని పెంబర్తిలో బయటపడ్డ లంకెబిందెల్లోని నగలు అమ్మవారి ఆభరణాలుగా భావిస్తున్నారు.

Update: 2021-04-09 07:36 GMT

జనగామ పట్టణం సమీపంలోని పెంబర్తిలో బయటపడ్డ లంకెబిందెల్లోని నగలు అమ్మవారి ఆభరణాలుగా భావిస్తున్నారు. బిందెలో లభించిన వస్తువులు దేవతా విగ్రహాలకు అలంకరించే బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. అవి మట్టితో కప్పి ఉండటంతో వాటిని శుభ్రం చేసిన పంచనామా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాలకు అలంకరించే బుట్టలు, కమ్మలు, వెండి గొలుసులు.. కడియాలు ఉన్నాయి. మొత్తం 19 తులాల బంగారం, 1.7 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.

వీటితోపాటు.. పగడాలు.. 12వందల రాగి వస్తువులు కూడా ఉన్నాయి. లంకె బిందెలో లభించిన నగలు అమ్మవారి విగ్రహనికి అలంకరించే ఆభరణాలతోపాటు.. ఆలయంలో ఉపయోగించే వస్తువులు ఉన్నాయి. వీటిలో హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు కూడా అందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. లంకె బిందెలు బయటపడ్డాయని తెలియడంతో వాటిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

పెంబర్తిలోని వెంచర్‌ లంకె బిందె బయటపడిన స్థలంలో తవ్వకాలు చేపడుతామని అధికారులు వెల్లడించారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా....పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చారు. పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ రాములునాయక్‌ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించి..అవి 1940 నాటివిగా తెలిపారు. స్థానికుల్లో స్థితిమంతులు ఎవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చారు.

Tags:    

Similar News