MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
కాంగ్రెస్ చేజారిన సిట్టింగ్ స్థానం... ఉత్తర తెలంగాణలో పట్టు నిరూపించుకున్న హస్తం పార్టీ;
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్యఓట్లతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ గెలుచుకున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్యఓట్లలో ఎవరికీ కోటా ఓటు లభించక పోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్టను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు.
రెండో ప్రాధాన్యత ఓట్లతో..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28,686 ఓట్లు చెల్లలేదు. వీటిలో 75,675 బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, 70,565 కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి, 60,419 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలోనే 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలి. కానీ మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థికి కూడా అన్ని ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. మొత్తం 56 మంది పోటీచేయగా, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించేందుకు గాను 54 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. చివరకు బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాకపోయినా 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఉండడంతో మూడో ప్రాధాన్యానికి వెళ్లకుండా అంజిరెడ్డి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓడిపోవడంతో కంటతడి పెట్టారు.
హస్తం పార్టీకి ఊహించని షాక్
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచీ గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రె్‌సకు ఊహించని షాక్ తగిలింది.