బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఫోన్ టాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సిట్ కేసు అంతా ఉత్తదేననీ.. విచారణ మధ్యలో అధికారులు బయటకు వెళ్లి రెండుసార్లు ఫోన్ మాట్లాడి వచ్చారని తెలిపారు. వాళ్లు ఎవరితో మాట్లాడారు తనకు తెలియదని.. ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అంటూ తేల్చేశారు హరీష్ రావు. ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ అనేది హోం శాఖ సహాయ కార్యదర్శి, డీజీపీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని.. కాబట్టి వాళ్లను కూడా విచారణకు పిలిస్తే అన్ని నిజాలు తెలుస్తాయని తెలిపారు. అంతేతప్ప ఆ డిపార్ట్మెంట్ తో సంబంధంలేని తనను పిలిస్తే ఇది కక్షపూరితంగానే భావించాల్సి ఉంటుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావును రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును మళ్ళీ తిరగదు తమ మీద కక్ష సాధిస్తున్నారని చెప్పారు. అవసరం అనుకుంటే తనను, తన తండ్రి కేసిఆర్ ను కూడా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని.. తమకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక కేసును ఏళ్లకు ఏళ్లు సాగదీసే బదులు అందులో ఉన్నది ఎంతవరకు నిజమనేది వెంటనే తెలిస్తే బెటర్. ఇప్పుడు హరీష్ రావు ఆరోపించినట్టు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన డీజీపీని, ఇతర అధికారులను విచారణకు పిలుస్తారా లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.
ఒకవేళ వారిని విచారణకు పిలిస్తే ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలా కాదని కేవలం రాజకీయ నేతల వరకే ఈ విచారణ ఆపితే మరిన్ని అనుమానాలు కూడా పెరుగుతాయి. కాబట్టి సిట్ అధికారులు ఇలాంటి ప్రకంపనలు రేపే కేసును వీలైనంత త్వరగా చేదిస్తే అందరి అనుమానాలు తీరిపోతాయి. లేదంటే తప్పు ఎవరిదో తెలియకపోతే రాజకీయంగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి వస్తుంది. మరి సిట్ అధికారులు ఏం చేస్తారో చూడాలి.