HCU: విద్యార్థులపై విరిగిన లాఠీ

హెచ్‌సీయూ భూములపై కొనసాగుతున్న వివాదం.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు;

Update: 2025-04-03 02:30 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ గేటు లోపలే ఉండి వారు నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల భూమి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల నిరసనలను ఉద్ధృతం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి చేయి దాటి పోతుండడంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దొరికిన విద్యార్థుల‌ను దొరికిన‌ట్లు లాఠీల‌తో చిత‌క‌బాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెస‌ర్లు విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ, పోలీస్ జులుం న‌శించాల‌ని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని మరింత పెంచాయి. అయితే హైదరాబాద్ కు ఆక్సిజన్ అందిస్తూ ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్న అటవీ ప్రాంతంలో విధ్వంసాన్ని ఆపాలని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

హైకోర్టు కీలక ఆదేశాలు

హెచ్‌సీయూ భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ్టీ వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పు వాయిదా వేసింది. హెచ్‌సీయూ తరఫున ఎల్. రవి చందర్ వాదనలు వినిపించారు. అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీం కోర్టు తీర్పుకు లోబడే పని చేయాలని, అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు విన్న అనంతరం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రానికి కేంద్రం లేఖ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వ్యవహారం సంచలనం రేపుతున్న వేళ... అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ స్పందించింది. కంచె గచ్చిబౌలి గ్రామంలో అక్రమంగా వృక్షాలను నరికివేయడం, తొలగించడం పై రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలిగించారని, వన్యప్రాణులు, సరస్సులు, పురాతన రాతి నిర్మాణాలకు నష్టం కలిగించారని వివిధ వార్తా పత్రికల్లో కథనాలు వెలువడినట్లు పేర్కొంది. పర్యావరణానికి విఘాతం కలిగించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక ఇకపై వివాదానికి తావు లేకుండా.. యూనివర్సిటీలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సలహా ఇచ్చింది. ఈ వ్యవహారంలో నిజా నిజాలపై విచారణ సాగించి, పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది.

Tags:    

Similar News