తెలంగాణలో మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్లకు సంబంధించిన కోర్టు తీర్పుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఎక్స్ లో స్పందించారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 15% అన్‌రిజర్వ్‌డ్ కోటాలో చదివిన నాన్ లోకల్ విద్యార్థులను, పీజీ అడ్మిషన్లలో లోకల్ కోటాకు ఇన్‌ఎలిజిబుల్ చేసి, తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా జీవో 148, 149 తీసుకొచ్చామనీ.. ఈ మార్పు తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడానికే తప్ప, వారికి నష్టం చేసేందుకు కాదన్నారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పడాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారనీ.. ఈ తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారం, గోబెల్స్ కూడా సిగ్గుపడేలా ఉందన్న దామోదర రాజనర్సింహ.. అలాంటి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక విద్యార్థులకు పీజీ సీట్లు దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.