నల్గొండ జిల్లాలో వాన బీభత్సం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. రహదారులపై ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది..

Update: 2020-10-14 02:06 GMT

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. రహదారులపై ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారితో పాటు.. భువనగిరి- చిట్యాల, నార్కెట్‌పల్లి- అద్దంకి హైవేలపై ట్రాఫిక్‌ జామ్ అయింది. గంటల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో... ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించే పరిస్థితి కూడా లేదు.

చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జ్‌ వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో.. వాహనాలు స్తంభించాయి. ఇక వెలిమినేడు అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌ పైనుంచి వరద నీరు లీకవుతోంది. తిప్పర్తి వద్ద రహదారిపై నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు పారుతోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో.. వాహదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద.. చిట్యాల- భువనగిరి రహదారిపై వరద ప్రవాహంలో ఆరుగురు గల్లంతు అయ్యారు. విషయం తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఒకరిని రక్షించారు. భువనగిరి ఎస్సై రాఘవేంద్ర.. నీటిలోకి వెళ్లి తాడు సహాయంతో ఒకరిని కాపాడారు. మిగతా ఐదుగురు వరదలో గల్లంతు కావడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో.. సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది.

భువనగిరి పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ముందు.. బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళుతున్న క్రమంలో వరద ఉధృతిని తట్టుకోలేక బైక్ కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో వర్షం ధాటికి పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నివాసితులు. రోడ్డుకిరువైపులా వరదనీటి కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భారీ వర్షాలకు నీట మునిగిన గుండాల పోలీస్ స్టేషన్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. స్టేషన్ ఆవరణలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అటు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తహసీల్దార్‌ కార్యాలయం జలమయమైంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో కోతకు వచ్చిన వరి నీట మునిగింది. అటు.. ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News