ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే. అవకాశం ఉందని దీని ప్రభావంతో అయిదు రోజులపాటు తెలంగాణ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే ఈ అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో రానున్న అయిదు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది