TG: తెలంగాణలో 5 రోజులు వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ... హైదరాబాద్‌లోనూ భారీ వర్షం!;
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దశగా కదులుతూ.. మరింత బలంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చించింది. ఇక జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఓ చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, వికారాబాద్ జిల్లా తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బాలానగర్, ఖైరతాబాద్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, ప్రగతినగర్, పటాన్‌చెరు, మేడ్చల్, దుండిగల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరు, గుండ్ల పోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం తదితర ప్రాంతాల్లో వానలుపడ్డాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా నగరంలో వర్షాలకు ఛాన్స్ ఉండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.