మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయవ్య, మధ్య బంగాళాఖాతం సమీపంలో పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, గోపాల్‌పూర్‌నకు తూర్పుదిశలో కేంద్రీకృతమైంది. క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తోంది. పూరీ, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 12 నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో 5-10 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ
వికారాబాద్ జిల్లాలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. శంకర్‌పల్లిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి. టంగుటూరు-మోకిల రోడ్డును సురక్షత కారణంగా అధికారులు మూసివేశారు. అలాగే, అంబర్‌పేట-ముసారంబాగ్ బ్రిడ్జీ పై రాకపోకలు నిలిపివేయడం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ నది నిండిపోయింది. ఆ కారణంగా ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్నారు. అంబర్‌పేట ముసారంబాగ్ బ్రిడ్జీ పై వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రజల భద్రత కోసం బ్రిడ్జీపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
తెలంగాణకు రెడ్ అలర్ట్
వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పూరీ, కళింగపట్నంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.