MEDARAM: మేడారం, నాగోబా జాతరలకు పోటెత్తిన భక్తులు

అత్యంత వైభవంగా కేస్లాపూర్ నాగోబా జాతర

Update: 2026-01-20 06:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన రెండు అతిపెద్ద జాతరలు ఒకేసారి జరుగుతున్నాయి. 'తెలంగాణ కుంభమేళా'గా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుండగా, 20 రోజుల ముందుగానే మేడారం గ్రామానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు, వెయ్యేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం పరిసరాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవార్ల గద్దెలను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా వస్తున్నారు. మేడారం పరిసరాలు విద్యుద్దీపాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ జాతరలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్కకు గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ నెల 30న భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 31న సాయంత్రం 6 గంటలకు వన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.


వెయ్యేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మెసేరాం వంశీయుల ఆరాధ్యదైవం అయినా నాగోబా చెంత ఈ నెల 22న నిర్వహించే 'ప్రజా దర్బార్' కార్యక్రమం ద్వారా గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదిక కానుంది. అనంతరం 23వ తేదీన నిర్వహించే సాంప్రదాయ బేతాల్ పూజతో ఈ చారిత్రక జాతర ఘనంగా ముగియనుంది. ఒకే సమయంలో అటు మేడారం, ఇటు నాగోబా జాతరలు జరగనుండటంతో గిరిజన పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. కాగా ఈ రెండు గిరిజన జాతరలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేస్తుంది. 

Tags:    

Similar News