MEDARAM: మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారం జాతర విధుల్లో 42 వేల మంది ఉద్యోగులు
ములుగు జిల్లా మేడారానికి భారీగా భక్తులు పోటెత్తారు. మహాజాతరకు ముందే భక్తులు తరలిరావటంతో వనదేవతల పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
విధుల్లో 42 వేల మంది అధికారులు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ ఏర్పాట్లన్నింటిపై నిత్యం ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం మేడారంలోనే బస చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, సుభిక్ష దర్శనం ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది, మేడారం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు.
జాతరకు ప్రత్యేక బస్సులు
ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జాతర జరిగే మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మేడారానికి భక్తులతను సురక్షితంగా తరలించేందుకు భూపాలపల్లి ఆర్టీసీ డిపో అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి మొదలై జాతర మొదలు ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. 8 రోజుల పాటు భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా 340 బస్సులను సిద్ధం చేశారు. రోజుకు సుమారు 50 ట్రిప్పులను నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకు నాలుగు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.