Huzurabad By Election: ఓటుకు 6 వేలు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాలు..
Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వానికి తెర లేచింది.;
Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వానికి తెర లేచింది. రాత్రి 7 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈలోపే ప్రలోభాలు షురూ.. అయ్యాయి. కొందరు వందల కోట్లు పంచుతున్నారు. ఒక్కొక్క ఓటుకు 6 వేలు పంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఓట్లను బట్టి అవసరమైతే అదనంగానూ డబ్బులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వందల కోట్ల డబ్బు, మద్యం పంపిణీతో అత్యంత కాస్ట్‌లీగా మారింది ఈ ఎన్నిక. నోటిఫికేషన్‌కు 2 నెలల ముందు నుంచే ఓటర్లకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. కులసంఘాలు, యూనియన్లకు సైతం కావాల్సినవి చేసిపెట్టేశాయి పార్టీలు. ఈసీ ఆంక్షలు, పోలీసు నిఘా దాటి మరీ సైలెంట్‌గా పంపకాలు జరుగుతున్నాయి. ఒక్క హుజురాబాద్ బైపోల్‌కి 300 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని పలువురంటున్నారు.
గత కొన్ని నెలలుగా హోరాహోరీగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. 2 లక్షల 36 వేల 873 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో లక్షా 19 వేల 093 మంది మహిళలు ఓటర్లు, లక్షా 17వేల 779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే ఒక ట్రాన్స్‌జెండర్ ఓటరు ఉన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకోసం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 172 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 63 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. రెండువేల మంది పోలీసులతో పాటు 20 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను భద్రత కోసం నియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. పోలింగ్ సమయంలో ప్రతి ఒక్క ఓటర్ కరోనా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌లు, సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని లేకుంటే ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు