HYD METRO:హైదరాబాద్ మెట్రో ఇక తెలంగాణ ప్రభుత్వానిదే

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం

Update: 2026-02-23 15:42 GMT

హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో రైలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రజల రవాణా అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చేందుకు, భవిష్యత్ విస్తరణ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం మెట్రోను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రకటన వెలువడింది. స్వాధీనం ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ స్వాధీనం ప్రక్రియలో జరిగే పరిపాలనా, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది.

గత ఏడాది సూత్రప్రాయంగా కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎల్‌అండ్‌టీకి రూ.2,000 కోట్ల ఈక్విటీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి చెల్లించనుంది. అలాగే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు రూ.13,000 కోట్ల రుణభారం రాష్ట్ర ప్రభుత్వం తనపైకి తీసుకోనుంది. ఈ అవగాహన తర్వాతే స్వాధీనం ప్రక్రియ వేగం పుంజుకుంది. మెట్రో ఆస్తుల విలువ నిర్ధారణ కోసం ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ మదింపు చేపట్టగా, రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డీఎంఆర్‌సీ సమగ్ర పరిశీలన జరిపి ప్రాథమిక నివేదికలు సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తంగా, హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్ విస్తరణ, నిర్వహణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News