Hyderabad : లేటెస్ట్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్ : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఆధునిక టెక్నాటజీ హబ్ మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు వెల్లడించారు. మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహాకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఏఐ, ఆధునిక సాంకేతికతలో గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ విస్తరిస్తోందని చెప్పారు. ఆదివారం హైటెక్ సిటీలో కృత్రిమ మేధ ఆధారిత సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా డెలివరీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన 'డేటా ఎకానమీ నూతన వర్క్ స్టేషన్'ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్విన్స్, డేటా బదిలీ రంగాల్లో ఈ సంస్థ గణనీయ పురోగతిని సాధించడం సంతోషంగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నందున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తాము నెలకొల్పే ఏఐ సిటీ అభివృద్ధిలో డేటా ఎకానమీ భాగస్వామి కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి కోపురి, జవహర్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.