TG High Court : హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వెంటనే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని HCA అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫోర్జరీ , నిధుల దుర్వినియోగం కేసులో ఇప్పటికే అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరెస్టయ్యారు. నకిలీ పత్రాలతో శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి దాని ద్వారానే HCAలో అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. అయితే గతంలో జరిగిన వివిధ కాంట్రాక్టులు, వర్కర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వెంటనే బిల్లులు చెల్లించాలని HCA ను ఆదేశించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం హై కోర్డు ఆదేశాలను పెడ చెవిన పెట్టింది. ఎవరికి బిల్లులు చెల్లించకపోవడంతో HCA అధికారుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదో నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని HCA అధికారులను ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణ ను 18కి వాయిదా వేసింది కోర్టు.