METRO: హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీల పెంపు

భారీ నష్టాల్లో హైదరాబాద్‌ మెట్రో... ఎంత పెంచాలి అనే దానిపై చర్చ;

Update: 2025-04-17 03:30 GMT

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌. మెట్రో రైలు ఛార్జీల పెంపు ఖాయమైంది. హైదరాబాద్‌ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలు ఏడేళ్ల క్రితం నిర్ణయించినవి అని, ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు సదరు సంస్థ తెలిపింది. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మధ్యనే బెంగళూరు మెట్రో రైలు ఛార్జీలను అక్కడి ప్రభుత్వం 50 శాతం వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న 57 మెట్రో రైళ్లు మూడు మార్గాల్లో చాలడం లేదు. వాటికి అదనంగా మరో 10 రైళ్లు అయినా అవసరమని మెట్రో వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తమ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని, సర్కారు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే కొత్త కోచ్‌లు కొంటామని అంటోంది.

రూ.6, 500 కోట్ల నష్టాలు..

2017 నవంబరు నుంచి దశలవారీగా మెట్రోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రోరైలు నష్టాలు రూ.6,500 కోట్లకు చేరాయని సంస్థ పేర్కొంది. స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ లీజ్, ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్నా నష్టాలు భరించలేని స్థాయికి చేరాయంటోంది. కొవిడ్‌తో తీవ్రంగా నష్టపోయామని మెట్రోరైలు ఛార్జీలను సవరించాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రో 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో కేసీఆర్‌ సర్కారు ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా.. కేంద్ర ప్రభుత్వం మెట్రోరైల్వే సెక్షన్స్‌ 33, 34 ప్రకారం కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ప్రసాద్‌ ఛైర్మన్‌గా, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర కుమార్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సభ్యులుగా కమిటీ వేశారు. ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో ప్రతిపాదనలను కమిటీ అధ్యయనం చేసింది.

ఎంత పెరగొచ్చు?

నష్టాలు ఏటా పెరుగుతుండటం, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44 శాతం పెరగడంతో హైదరాబాద్‌ మెట్రో సైతం ఛార్జీల పెంపునకు సిద్ధపడింది. ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.60 ఉండగా ఎంత పెంచాలి? ఎప్పుడు పెంచాలి? మొదట పెంచి ఆ తర్వాత తగ్గించాలా? ఇలాంటి పలు కోణాల్లో సదరు సంస్థ ఆలోచిస్తోంది.

Tags:    

Similar News