కేంద్ర ప్రభుత్వం నూతనంగా పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి నియమించారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు.