BJP: తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ..
BJP: బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈనెల 5న మహబూబ్ నగర్‌కు రానున్నారు.;
BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈనెల 5న మహబూబ్ నగర్‌కు రానున్నారు. స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలోజరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. దీంతో ఈ సభను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. ఇందు కోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు. బహిరంగ సభ నిర్వహణపై బండి సంజయ్ అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతలతో చర్చించారు. గత 18 రోజులుగా బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర తీరు తెన్నులు, ప్రజల స్పందనపైనా చర్చించారు. పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారన్నారు.
ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట బహిరంగ సభల్లానే.. మహబూబ్‌నగర్ సభను సక్సెస్ చేస్తామన్నారు. పాలమూరు గడ్డా.. బీజేపీ అడ్డా అన్నారు బండి సంజయ్. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఉమ్మడి జిల్లా ప్రజలు సక్సెస్ చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఏర్పడిందన్నారు. 5న జరిగే బహిరంగ సభను సక్సెస్ చేసి సత్తా చాటాలన్నారు బండి సంజయ్..