తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన పన్నులతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో రెడ్డి రాజ్యాన్ని పడగొట్టి... బీసీ రాజ్యాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. ఈరోజు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదన్నారు. వరంగల్‌లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనను అడ్డుకున్నారని ఆరోపించారు. తాను సదాశివపేటను అభివృద్ధి చేసినట్లుగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలకు సూచించారు. వంద రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.