TG : దేవనపల్లి కవితగా మారిన కల్వకుంట్ల కవిత... సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ...

Update: 2025-09-03 14:30 GMT

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన తర్వాత ఆమె పేరు చుట్టూ ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. ఇప్పటివరకు 'కల్వకుంట్ల కవిత'గా పిలువబడిన ఆమెను, ఆమె భర్త ఇంటిపేరైన దేవనపల్లి కవితగా పిలవాలని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇంటి పేరు అంశం ఇపుడు కీలకంగా మారింది.

పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం తర్వాత పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలను దహనం చేయడమే కాకుండా, పార్టీ కార్యాలయాల్లోని ఆమె పోస్టర్లు, బ్యానర్లను కూడా తొలగించారు. ఈ క్రమంలోనే, కవితను 'కల్వకుంట్ల' అనే ఇంటిపేరుతో పిలవడానికి ఆమెకు అర్హత లేదని, ఆమెను 'దేవనపల్లి కవిత'గా మాత్రమే పిలవాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ వివాదానికి మరింత బలం చేకూర్చుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ‘బీఆర్ఎస్ పార్టీ న్యూస్’ అనే ఎక్స్ ఖాతా లో ఒక పోస్ట్ చేశారు. "ఇన్ని రోజులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫేక్ న్యూస్ బెడద ఉండేది. ఇప్పుడు కొత్తగా దేవనపల్లి కవిత వర్గం నుంచి ఫేక్ సమస్య మొదలైంది" అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా ఇది పార్టీకి, కవితకు మధ్య ఉన్న దూరాన్ని స్పష్టం చేస్తోంది. ఒక అధికారిక పార్టీ ఖాతానే ఆమెను 'దేవనపల్లి కవిత వర్గం' అని సంబోధించడం ఇద్దరి మధ్య సంబంధాలు ఎంతగా క్షీణించాయో తెలుపుతోంది. ఈ పరిణామం కవిత వర్సెస్ బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత తీవ్రం చేసింది.

Tags:    

Similar News