KAMAREDDY: రణరంగంగా మారిన కామారెడ్డి
కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య సవాళ్లతో ఉద్రిక్తత
కామారెడ్డిలో రాజకీయ వేడి ఒక్కసారిగా హైటెన్షన్‌గా మారింది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, శిశు మందిర్ అంశాలపై కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ “డౌన్ డౌన్” నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో పోలీసులు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన అక్కడితో ఆగలేదు. మహేందర్‌రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో కూడా కొంతసేపు వాగ్వాదం జరిగింది.
కారు ధ్వంసంతో ఉద్రిక్తత
కేవలం కారును ధ్వంసం చేయడమే కాకుండా, దానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. దీంతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పించి, కాలిపోయిన కారును అక్కడి నుంచి తరలించారు. ఇక ఈ ఉద్రిక్తతకు మూలం డిగ్రీ కాలేజీ భూముల వివాదమే. తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని ప్రకటించారు. అయితే బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో కాంగ్రెస్–బీజేపీ నేతల మధ్య విమర్శల పరంపర కొనసాగుతోంది. తాజా ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిపై పోలీసులు నిఘా పెంచి శాంతిభద్రతలు కట్టుదిట్టం చేశారు. డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.