Rahul Gandhi: భారాస పాలనలో 8 వేల మంది రైతుల ఆత్మహత్య
సంగారెడ్డిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం;
కేసీఆర్ పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు. తెలంగాణలో దొరల సర్కార్ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు మద్దతుగా అందోల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉందని, ఢిల్లీలో నరేంద్రమోదీకి కేసీఆర్ సహకరిస్తారు... తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకరిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం నాడు ఆందోల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఎన్నో కలలు.. ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కేవలం తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు.
తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్నది ప్రశ్న కాదు.. కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించారు. కేసీఆర్ ప్రజా ధనం వృథా చేశారని పేర్కొన్నారు.
ల్యాండ్.. శాండ్.. మైన్స్.. వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను గుప్పెట్లో పెట్టుకొని పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. పరీక్ష పేపర్లు లీక్ కావడం వల్ల ఎంతోమంది ఉద్యోగ అభ్యర్థులు నష్టపోయారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై తొలి కేబినెట్ సమావేశంలోనే సంతకం చేస్తామన్నారు.