తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల పరిస్థితి తెలుసుకునేందుకు పార్టీ నేతలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నివాసాలు మునగడం, రోడ్లు దెబ్బతినడం, రవాణా వ్యవస్థ స్తంభించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో తమ వంతుగా ప్రజలకు సహాయం అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాగా ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.