బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచే రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆరోగ్యంపై చికిత్స తీసుకుంటున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతలతో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆసుపత్రిలోనే చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు ఆసుపత్రికి తరలివచ్చారు. వీరితో రాష్ట్రంలోని రైతుల ఇబ్బందులు, వ్యవసాయ రంగంలోని సంక్షోభం, సాగునీటి సమస్యలు వంటి అంశాలపై కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. నేతలు వెల్లడించిన క్షేత్రస్థాయి వివరాలను కేసీఆర్ ఓపికగా విని.. వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు నేతలు తెలిపారు. మరోవైపు.. యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పలువురు భారత రాష్ట్ర సమితి నేతలు శుక్రవారం పరామర్శించారు. నేతలతో కేసీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉండడంతో కేసీఆర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను పరీక్షించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.