KCR: ఒక్క ఓటమితో ఆగమైతమా: కేసీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని... కేసీఆర్ దిశా నిర్దేశం;
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ సమర శంఖం పూరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకునేలా వ్యుహరచన చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ స్పందించారు. ఒక్క ఓటమితో తమ పార్టీ ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఒక్క ఓటమి.. బీఆర్ఎస్ ను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో ఎదుర్కొని గులాబీ జెండా నిలబడిందని గుర్తు చేశారు. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామని.. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం
బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అనుభవించాక.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతలు భ్రమల్లో ఉన్నారని.. ఆ భ్రమలను వీడి బయటకు రావాలని స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో బయటకు వెళ్లారని గుర్తు చేశారు.
తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం: కేసీఆర్
తెలంగాణలో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ కూడా అన్నారు. అయితే తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఉప ఎన్నికలు జరగబోవని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.