KCR: మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు లొంగుబాటు... మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావుకు సుప్రీం భారీ ఎదురుదెబ్బ... ముందస్తు బెయిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎస్ఐబీ చీఫ్, ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (ప్రత్యే దర్యాప్తు బృందం) ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆయన హాజరు కావడం గమనార్హం. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో, అమెరికాలో ఉండి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలో), ఉదయం 11 గంటలకు సిట్ అధికారి ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు చట్ట ప్రకారం జరగాలని, నిందితుడికి ఎలాంటి భౌతిక హాని జరగకుండా చూడాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావు లొంగుబాటుతో సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థకు, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ కస్టడీలోకి రావడం అత్యంత కీలకం.
కస్టోడియల్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఉద్దేశాలు, అధికార దుర్వినియోగం, కేసు పరిధి ఎక్కడి వరకు విస్తరించిందనే అంశాలపై మరింత లోతైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక, ఆపరేషనల్ వివరాలు, ఆదేశాలు ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయాలు సిట్‌కు లభించవచ్చు. ప్రభాకర్‌రావు అరెస్టు-విచారణ బీఆర్ఎస్ నేతలకు మరియు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా భారీ షాక్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం కొంతమంది పోలీసు అధికారుల చర్యగా కాకుండా, అధికారంలో ఉన్న ప్రభుత్వ స్థాయిలో జరిగిన వ్యవస్థీకృత చర్యగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాకర్‌రావు కస్టడీలోకి వస్తే, కేసీఆర్ హయాంలో ఎస్ఐబీ కార్యకలాపాలు, ప్రభుత్వ అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు, ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ కోణం వంటి అంశాలపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాజీ సీఎం కేసీఆర్ పాత్రపై ఎలాంటి అధికారిక సమాచారం లేదా చార్జ్ లేదు. కానీ, కీలక నిందితుడి లొంగుబాటుతో దర్యాప్తు సంస్థలు ఆయన పాత్రపై దృష్టి సారిస్తాయనే ఊహాగానాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.