KCR: అరెస్ట్ చేస్తారు.. అయినా భయపడొద్దు
కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కాళేశ్వరం నివేదికతో ఎలాంటి ఇబ్బంది లేదు;
కాళేశ్వరం కమిషన్ నివేదిక బహిర్గతమైన వేళ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. అయినా ఎవరూ భయపడవద్దని నేతలకు దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రాజకీయ పన్నాగం తప్ప మరేం కాదని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాదని చెప్పేవారు అజ్ఞానులని తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం అంశంపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన భవిష్యత్ చర్యలపై చర్చించారు. సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్” అని వ్యాఖ్యానించారు. కమిషన్ నివేదిక ఊహించినట్లుగానే వచ్చిందని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల రాజకీయాన్ని.. రాజకీయంగానే తిప్పికొడదామని.. ఈ పోరాటంలో పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీగా బలంగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు విపులంగా వివరించాలని... పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని చూసి తగిన వ్యూహం సిద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.