ఖమ్మం మేయర్ ఎవరు..? మూడు రోజులు నామినేషన్ల స్వీకరణ

ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అవడంతో.. ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

Update: 2021-04-16 07:03 GMT

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు అభ్యర్థులు తమ పత్రాల్ని సమర్పించొచ్చు. ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అవడంతో.. ఆ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉంటే వాటిల్లో వీటిల్లో 50 శాతం డివిజన్లు మహిళలకు కేటాయించారు.

ఇందుకు సంబంధించిన రిజర్వేషన్‌ల లాటరీ కూడా నిన్ననే పూర్తయ్యింది. జనరల్ స్థానాల్లో మహిళలకు 16, BC మహిళకు 10, SC మహిళకు 3, ఎస్టీ మహిళకు 1 స్థానం రిజర్వ్ అయ్యాయి. ఆయా డివిజన్లలో పోటీ చేసిన వారిలో ఎవరికి మేయర్ పీఠం దక్కుతుంది, రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అనేదానిపై ఎన్నికల తర్వాతే స్పష్టత రానుంది.

ఖమ్మం మేయర్ ఎవరు..? ప్రస్తుతం TRS వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ పదవి మంత్రి పువ్వాడ అజయ్ సతీమణికే దక్కుతుందని తెలుస్తోంది. కార్పొరేషన్‌లో గులాబీ జెండా ఎగరడం, వసంత లక్ష్మి మేయర్ కావడం ఖాయమంటున్నారు. ఇప్పటివరకూ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా ఈసారి బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడం కూడా ఇక్కడ కలిసొచ్చే అంశం అంటున్నారు. ఐతే.. దీనిపై మంత్రి సన్నిహితులు ఇంకా ధృవీకరించడం లేదు.

ఖమ్మం కార్పొరేషన్‌కి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఐతే.. ఈసారి రిజర్వేషన్ల లెక్కలతో తాజా మాజీలు చాలా మంది పోటీకి దూరం అవుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ సహా మరికొందరు ఈసారి అవకాశం కోల్పోతున్నారు. గత ఎన్నికల్లో 2వ డివిజన్ నుంచి గెలిచిన పాపాలాల్‌ ST కోటాలో మేయర్ అయ్యారు.

ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అవ్వడంతో ఆయన కార్పొరేషన్ బరి నుంచి తప్పుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. డివిజన్ల పునర్విభజన కారణంగా మరికొందరు కూడా అవకాశం కోల్పోయారు. కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారు ఏ డివిజన్‌ నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉన్నా.. స్థానికంగా ఉండే సమీకరణాల దృష్ట్యా, అధిష్టానం అండ లేకుండా వేరొక చోటే పోటీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి.. కొందరు లీడర్లు ఈసారి బరిలోకి దిగేపరిస్థితులు కనిపించడం లేదు.

Tags:    

Similar News