KONDA SUREKA: తెలంగాణ ప్రభుత్వంలో కొండంత రచ్చ
ఏది మాట్లాడినా వివాదాస్పదమే.. సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్న సురేఖ;
కొండా సురేఖ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మాటకు కట్టుబడి ఉండే ధైర్యం.. మానసిక స్థైర్యం.. ధాటిగా మాట్లాడే తీరు కొండా సురేఖ సొంతం. ఒకప్పుడు సురేఖకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉండేవారు. కానీ నాటి సురేఖకు నేడు మంత్రిగా ఉన్న సురేఖకు అసలు పోలికే కనిపించడం లేదు..! ఇపుడు ఏది మాట్లాడినా.. ఏ విషయం పై అభిప్రాయం వ్యక్తం చేసినా వివాదాస్పదమే అవుతోంది. ఆమె మనసులో ఏదో అనుకుంటూ.. బయటకు ఇంకోటి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదం అవుతోంది. కొన్నిసార్లు ఆమె కామెంట్స్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏది మాట్లాడినా వివాదాస్పదమే..
అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య, నటి సమంత వివాహ బంధం విడాకులకు దారితీసిన పరిస్థితులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సమంత గురించి ఒక మహిళా మంత్రి తీవ్రమైన ఆరోపణలతో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడమేంటని సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు నిలదీశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది. మొదట్లో తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న సురేఖ.. ప్రజలనుండి వ్యక్తమవుతున్న స్పందన చూసి వెనక్కి తగ్గారు. మొత్తంగా సమంతకు క్షమాపణలు చెప్పారు. మంత్రి పదవి ఆమెలో ఒకవిధమైన మార్పును తెచ్చినట్లు కనిపిస్తుంది.ఎడాపెడా ఎవరిమీద పడితే వాళ్ళమీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సొంత పార్టీ నేతలమీద కూడా పరోక్ష విమర్శలు చేయడం చేస్తూ వస్తున్నారు. ఇక కేసీఆర్ కేటీఆర్ కవితలపై ఆమె తీవ్ర స్థాయిలో చేస్తున్న విమర్శలు, వాడుతున్న పదాలు అభ్యంతరకరంగా ఉంటున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
తాజా వ్యాఖ్యలు మళ్లీ వివాదస్పదం
కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. " ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారు.. నేను మాత్రం.. కాలేజీ భవనం కట్టాలని కోరా.." అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కలకలం రేగింది.
ఒకటి అనుకోవడం..ఇంకోలా మాట్లాడటం..!
తమ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాదని..ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే పార్టీ అంటూ చెప్పడానికి చేసే ప్రయత్నంలో కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఆలోచనలకు విరుద్ధంగా ఉంటూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.. మహిళా మంత్రిగా ఉన్నత బాధ్యతల్లో ఉన్న కొండా సురేఖ ఆ మధ్య ఇంట్లో శుభకార్యం సందర్భంగా బంధువైన యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ మద్యంపై చేసిన వ్యాఖ్యలు కూడా అటు ప్రభుత్వానికి..ఇటు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించే క్రమంలో కూడా తరచూ ఆమె వివాదాస్పదంగానే మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!
వక్రీకరించారు: కొండా సురేఖ
తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు. తాను యథాలాపంగా మంత్రులు అన్నానే తప్ప కాంగ్రెస్ మంత్రులు అని చెప్పలేదని, బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని తన వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు తీస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.