KTR:గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్
జాతీయ వేదికపై తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానం..ఫార్మూల ఈ రేస్ గురించి ప్రస్తావించిన కేటీఆర్.. క్లీన్ మొబిలిటీ కేంద్రంగా తెలంగాణ: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగులు తీసినప్పుడు, భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైంది. ఈ ఫార్ములా ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ నగరం వైపు మళ్లించింది" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఫార్ములా-ఈ ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమేనని కేటీఆర్ అన్నారు.
వందలాది మంది యువ ఇంజనీర్లకు సందేశమిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూడకుండా, వాటిని మీరే సృష్టించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. “మీరు సొంతంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడాలి?” అని ప్రశ్నించారు. “ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారండి. మీరు పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత, మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు” అని ఆయన ఉద్భోదించారు.
టీషర్టుల ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2023లో కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు భూమిపూజ చేశామన్నారు.‘వ్యవసాయం నుంచి ఫ్యాషన్’ నినాదంతో టెక్స్టైల్ పార్కును స్థాపించినట్లు చెప్పారు.