తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ఆయన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని దారపోసిన మహోన్నత వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు పలువురు ప్రముఖులు.
తెలంగాణ భావజాల వ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ వెన్నంటే ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడని అన్నారు. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని.. జోహార్ జయశంకర్ సార్...జై తెలంగాణ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జయశంకర్‌కు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ.. ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించిన గొప్ప వ్యక్తి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.