సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం డబ్బులు ఎక్కడ్నుంచి తెస్తారు..? అని కేటీఆర్ నిలదీశారు. మూసీపై రెండు, మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను అని తెలిపారు. మూసీ విషయంలో సీఎంకు, మంత్రులకు సయోధ్య ఉన్నట్లు లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లని ఎవరు చెప్పారని శ్రీధర్ బాబు అంటున్నారు. అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ సీఎం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు అని కేటీఆర్ విమర్శించారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ అనుమతి ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నారు. రాహుల్ వెనుకుండి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టును రాహుల్ చేపట్టారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ ఎక్కడున్నారు..? మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో త్వరలో బయటపెడుతా. కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు కావాలి.. కానీ బాధితుల కష్టాలు పట్టవా..? అని కేటీఆర్ నిలదీశారు.