KTR: కాంగ్రెస్‌కు కాలం చెల్లింది: కేటీఆర్
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ పాలనా వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు.
మీరు పిరికి పందలు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సోమార్పేట్ గ్రామంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బిట్ల బాలరాజుపై దాడిని కేటీఆర్ ఖండించారు. ఈ అమానుష ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. భౌతిక దాడులకు తెగబడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు.
ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై రాజకీయ కక్షలతో ట్రాక్టర్ తో దాడి చేయగా నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతుదారుడు ఓడిపోయాడు. అయితే తాము గెలిచినప్పటికీ గతంలో తమను ఇబ్బందులు పెట్టాడనే కక్షతో ప్రత్యర్థి వర్గం గ్రామంలోని ఓడిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిపై ట్రాక్టర్ తో దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు పేర్కొన్నారు. ట్రాక్టర్‌తో ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లగా బాలరాజు తప్పించుకున్నాడని వారు తెలిపారు. ట్రాక్టర్ తో ఢీకొన్న ప్రమాదంలో గంజి భారతి, తోట శారద, బాలమణి, సత్యవ్వ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గంజి భారతి, తోట శారద పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బాలమణి, సత్యవ్వలను ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. రాజకీయ కక్షలతోనే ఓడిన అభ్యర్థి ఇంటి పై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత వర్గానికి మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నాయకులు సభ్యులు గ్రామస్తులతో కలిసి ఎల్లారెడ్డి _ నిజాంసాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని, ఆయనను ప్రోత్సహించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.