మహిళపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఎల్బీనగర్ పోలీసులు..!
నడవలేనిస్థితిలో ఉన్న బాధిత మహిళ బాధిత మహిళతో కలిసి ఆందోళన చేసిన బంధువులు, కుటుంబ సభ్యులు;
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మహిళను హింసించిన హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకుంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌బీ నగర్ చౌరస్తాలో ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దారిన వచ్చిపోయేవారికి ఇబ్బందులు కల్గిస్తున్నారని వారిపై సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి..తర్వాత కోర్టులో హాజరుపర్చారు.
ముగ్గురు మహిళల్లో ఓ మహిళపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. తీవ్రంగా గాయపడిన మహిళ నడవలేని స్థితిలో ఉందని, ఆమెను కొట్టి మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు లాక్కున్నారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత మహిళతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన రాచకొండ సీపీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.