LOCAL WAR: 395 సర్పంచ్లు, 3,991 వార్డులు ఏకగ్రీవం
తెలంగాణ గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం.. బుజ్జగింపులు, ప్రచార పర్వాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత, రెండో విడత నామినేషన్లు పూర్తి కావడం, మూడో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఒక వైపు, నామినేషన్వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని గుర్తించిన కొందరు.. ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. అప్పటికీ వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నెల 11న జరగనున్న తొలి దశ సర్పంచి ఎన్నికల పోరులో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. 4,236 గ్రామాల్లో తొలిదశ పోలింగ్ జరగనుండగా.. 395 గ్రామాల్లోని సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు ఐదు ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచి పదవులకు 13,127 మంది పోటీపడుతున్నారు. అంటే ఒక్కో సర్పంచి పదవికి 3.42 మంది చొప్పున తుది బరిలో నిలిచారు. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వార్డుసభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వార్డులకు సభ్యులుగా పోటీ చేసేందుకు 67,893 మంది తుది బరిలో నిలిచారు. అంటే సగటున ఒక్కో వార్డు సభ్యుడి పదవికి 2.42 మంది చొప్పున పోటీపడుతున్నారు.
రెండో దశలో 28,278 నామినేషన్లు
ఈ నెల 14న జరగనున్న రెండో దశ ఎన్నికల్లో... 4,332 సర్పంచి పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీకి ఆరుగురు చొప్పున ‘నామినేషన్లు వేయగా’... రెండో దశలో సగటున 6.5 మంది పోటీపడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. 38,342 వార్డు స్థానాలకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డుకు సగటున 2.44 మంది పోటీ పడుతున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు గడువుంది. పోలింగు 14న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. రెండో దశలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 282 సర్పంచి పదవులకు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేటలో 181 స్థానాలకు 1447.. సిద్దిపేటలో 182 స్థానాలకు 1,367 మంది పోటీపడుతున్నారు. ఈ జిల్లాల్లో సర్పంచి పదవులకు సగటున 7.5 నుంచి 7.9 మంది పోటీపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 197 పంచాయతీలకు 1,025 మంది పోటీపడుతున్నారు. ఖమ్మంలో 183-1,055.. మహబూబాబాద్ 158-1,118.. మెదక్ 149-1,007.. నాగర్కర్నూల్ 151-1,042.. నిజామాబాద్ 196-1,178.. రంగారెడ్డి 178-1,114.. సంగారెడ్డి 243-1,444.. వికారాబాద్ జిల్లాలో 175 స్థానాలకు 1,113 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనుంది. కొనసాగింది.