LPG GAS: సిలిండర్ కోసం ఉరుగులు..పరుగులు..ఎదురుచూపులు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంటగ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ సరిగా జరగకపోవడం, ఇప్పటికే బుకింగ్ చేసిన వారికి కూడా సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో గ్యాస్ సరఫరా మరింత దెబ్బతింటుందేమోననే భయంతో చాలా మంది వినియోగదారులు ముందుగానే సిలిండర్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలోని రాజంపేట్ ప్రాంతంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అక్కడి గ్యాస్ గోడౌన్ నుంచి వినియోగదారులకు పంపిణీ చేయడానికి ఆటోలో సిలిండర్లు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కొందరు తమ ఖాళీ సిలిండర్లతోనే ఆటో వెనుక పరుగెత్తుతూ పంపిణీ కోసం ఎదురుచూశారు. పరిస్థితి కాస్త గందరగోళంగా మారడంతో సిబ్బంది రహదారి పక్కన ఆటోను ఆపి, ఇప్పటికే బుకింగ్ చేసిన వారి వివరాలు పరిశీలించి సిలిండర్లను అందజేశారు. అయినప్పటికీ సరఫరా పరిమితంగా ఉండటంతో అందరికీ వెంటనే సిలిండర్లు దొరకకపోవడంతో కొందరు వినియోగదారులు నిరాశకు గురయ్యారు.
ఇదే పరిస్థితి ఆదిలాబాద్ పట్టణంలో కూడా కనిపించింది. అక్కడ ఒక ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచే వినియోగదారులు భారీగా చేరుకున్నారు. చేతుల్లో ఖాళీ సిలిండర్లతో వారు ఏజెన్సీ వద్ద బారులు తీరారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి నిలబడి తమ వంతు కోసం వేచిచూశారు. గ్యాస్ సరఫరా ఆలస్యమవుతుండటంతో చాలామంది తమ వంట అవసరాలు ఎలా తీర్చుకోవాలనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బుకింగ్ చేసిన రెండు మూడు రోజుల్లోనే సిలిండర్లు వచ్చేవని, ఇప్పుడు మాత్రం రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని వాపోయారు. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం కూడా సమస్యను మరింత పెంచిందని తెలిపారు. పరిస్థితి ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో వంటగ్యాస్ కోసం మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారు: బీజేపీ
దేశంలో గ్యాస్ కొరత లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. కొంతమంది కావాలనే కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. “యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయి. మన దేశంలో మాత్రం పెరగలేదు. మోదీ ప్రభుత్వం ఈ ధరలను నియంత్రణలో పెట్టింది. గతంలో గ్యాస్ ధర రూ.1,200 ఉంటే.. మోదీ ప్రభుత్వం రూ.900లకు తగ్గించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.7వేల కోట్లు అంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు భాజపా వ్యతిరేకం కాదు. అయితే, 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలా? గుజరాత్లో ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశాం" అని రామచందర్ రావు అన్నారు. సిలిండర్ల కొరత వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ సరిగా జరగకపోవడం, బుకింగ్ చేసిన వారికి సిలిండర్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.