PAWAN: కన్నీరు మీ గడప తొక్కనివ్వను... కష్టం దరి చేరనివ్వను
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానని పవన్ ప్రకటన
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గిరిజనుల కష్టాలు తనకు తెలుసని, వారి గడపకు కన్నీరు చేరకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలకు రావడానికే చాలా మంది రాజకీయ నాయకులు వెనుకాడతారని, కానీ ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగరువు గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ గిరిజనులతో కలిసి ప్రత్యేకంగా “మాటామంతీ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు గ్రామస్తులు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమానంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. నందిగరువు గ్రామంలో సుమారు 40 గడపలు మాత్రమే ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు.
గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు ఆసుపత్రులకు చేరుకునే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనను కలచివేశాయని ఆయన అన్నారు. ఆ పరిస్థితులను మార్చేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు వినిపించకుండా ఉండాలని సంకల్పించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజల కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని.. గిరిజిన హక్కులకు భంగం కలగకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి సర్కారు పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్న పవన్ కళ్యాణ్.. ప్రజల కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవన్నారు. సరైన రహదారి లేకుండా గిరిజనులు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా.. తనతో పంచుకోవాలని కోరారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ సెంటర్ను సందర్శించి, అక్కడి చిన్నారులతో ముచ్చటించారు.