Minister KTR : బెంగళూరు కంపెనీలను ట్వీట్లతో ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్
Minister KTR : బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ.. ఖాతాబుక్ సీఈవో రవీశ్ నరేశ్ బెంగళూరు రోడ్లపై ట్వీట్ చేశారు.;
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ.. ఖాతాబుక్ సీఈవో రవీశ్ నరేశ్ బెంగళూరు రోడ్లపై ట్వీట్ చేశారు. వందల కోట్ల పన్ను చెల్లిస్తున్నా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కరెంటు కోతలు, నీటిసరఫరా దారుణమని, ఫుట్‌పాత్‌లు సక్రమంగా లేవంటూ ట్వీట్ చేశారు. దగ్గర్లో ఉండే ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా కనీసం 3 గంటలు పడుతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సేతు ఏపీఐ మేనేజర్ నిఖిల్ కుమార్ కూడా స్పందించారు. బెంగళూరు అధ్వానంగా మారిందని, పరిస్థితిలో మార్పు రాకపోతే సామూహికంగా వలసలు ప్రారంభమవుతాయంటూ సీఎం బసవరాజ్ బొమ్మైకు ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మీ బ్యాగ్‌లు ప్యాక్ చేసుకుని హైదరాబాద్‌కు రండంటూ ఆహ్వానించారు. హైదరాబాద్‌లో రోడ్లు, ఎయిర్‌పోర్ట్, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయని, సిటీలోకి రావాలన్నా, బయటకు వెళ్లాలన్నా సులభతరమైన మార్గాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.
బెంగళూరు కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేయండని కేటీఆర్ ఆహ్వానిస్తుండడంతో కర్నాటక ప్రభుత్వం భయపడుతోంది. ముఖ్యంగా అక్కడి ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ దూకుడు చూసైనా... ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అప్రమత్తం కావాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే ఓ సూచన చేశారు. స్టార్ట్‌ఆప్ కంపెనీలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు మాత్రమేనని, వాటిని అందిస్తే చాలని డిమాండ్ చేశారు.