ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లిన మంత్రి కేటీఆర్.. భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా...
KTR France Tour : ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఫ్రాన్స్ కు వెళ్లింది.;
KTR France Tour : ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఫ్రాన్స్ కు వెళ్లింది. తెలంగాణకు భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా... కేటీఆర్ నాలుగురోజుల ఫ్రాన్స్ పర్యటన కొనసాగనుంది. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో ఈ బృందం పాల్గొంటుంది. ఫ్రెంచ్ సెనేట్లో యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానించింది.
ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు ఈనెల 29న యాంబిషన్ ఇండియాలో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కొవిడ్ అనంతరం భారత్-ఫ్రెంచ్ సంబంధాలు - అభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకుంటారు. రెండు దేశాలకు చెందిన 700 మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 400కు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాన్ని కేటీఆర్ కీలకంగా భావించి, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ పారిశ్రామిక విధానాలు, ఇతర అనుకూలతలను తెలియజేసి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్నారు.
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో కేటీఆర్ సమావేశమవుతారు. హెల్త్‌కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. నవంబర్ ఒకటో తేదీ వరకు కేటీఆర్... ఫ్రాన్స్ లోనే ఉంటారు. కేటీఆర్వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఫ్రాన్స్‌కు వెళ్లిన రాష్ట్ర బృందంలో ఉన్నారు.