TG : ఖరీఫ్ నుంచే రూ. 500 బోనస్ : మంత్రి ఉత్తమ్

Update: 2024-09-24 07:15 GMT

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఖరీఫ్ లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో ధాన్యం సాగు జరిగిందన్నారు. 146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామన్నారు. 91 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి ఉన్నదని, 36 లక్షల 80 వేల ఎకరాల్లో సన్నాలు సాగు అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 88 లక్షల 9 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశామన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని, సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారులదే కీలక పాత్ర అని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలతో జనవరి నుండి చౌక ధరల దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం జగరగవద్దన్నారు.

Tags:    

Similar News