MISS WORLD:ప్రపంచ సుందరి ఓపల్ సుచాత
ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు.. మిస్ వరల్డ్ 2025గా ఓపల్ సుచాత;
ప్రపంచ అందాల పోటీలకు వేదికగా నిలిచిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి చరిత్ర సృష్టించింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, చివరికి థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా సుచాత ముద్దుగా కిరీటం పొందారు.
రన్నరప్స్:
1వ రన్నర్అప్: ఇథియోపియా
2వ రన్నర్అప్: పోలెండ్
3వ రన్నర్అప్: మార్టినిక్
"ఓపల్ ఫర్ హర్" – ఒక ఉద్యమం:
అంతర్జాతీయ వేదికపై విజయం సాధించిన సుచాత ఒక సాధారణ మోడల్ మాత్రమే కాదు. “ఓపల్ ఫర్ హర్” అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో అడుగుపెట్టిన ఆమె, క్యాన్సర్‌పై అవగాహన పెంచే ఉద్యమానికి బ్రాండ్ అంబాసడర్‌గా నిలిచారు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ను జయించిన ఆమె, థాయిలాండ్‌లో రొమ్ము క్యాన్సర్‌పై ప్రచారం చేస్తున్నారు. బాధితుల కోసం నిధుల సేకరణ, సంస్థలతో భాగస్వామ్యాలు ఆమె ముఖ్య లక్ష్యాలు.
హైదరాబాదులో అద్భుతమైన ముగింపు:
ఈ మెగా ఈవెంట్లో 108 దేశాల నుంచి అందాల భామలు పాల్గొన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా 20 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో కళ, శైలి, వ్యక్తిత్వం, సేవా దృక్పథం వంటి అంశాల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఖండాలవారీగా ఫైనలిస్ట్‌ల ఎంపిక అనంతరం, చివరికి నలుగురు గ్రాండ్ ఫినాలేకు చేరగా, సుచాత అందరికీ మెరుగై కిరీటాన్ని గెలుచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ హర్షాతిరేకం:
ఈ సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంతో ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. ఇది రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన దారులు వేసింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో మిస్ వరల్డ్ వేదికగా మారింది" అని అన్నారు. సుచాతను అభినందించిన ఆయన, "ఇలాంటి గ్లోబల్ ఈవెంట్లకు తెలంగాణ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది" అని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ జానపద కళలు, బతుకమ్మ, కొలాటం, గోల్లభామ పెయింటింగ్‌లు, కల్చరల్ వేదికల ప్రదర్శన, పర్ల్ జ్యూవెలరీల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ అతిథులంతా హైదరాబాదీ వంటకాల రుచిని ఆస్వాదించారు.